ఇరువురు దంపతులు “ఒకేసారి పోయే” సదుపాయం

వేదిక: యమలోకం
యమలోకంలో యమధర్మరాజు తన ముఖ్యమైన సిబ్బందితో “రహస్య సమావేశం” ఏర్పాటు చేసాడు-చర్చించబోయే విషయం చాలా సున్నితమైనది అవటంవల్ల. ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చేసారు,అప్పుడు యమధర్మరాజు మాట్లాడటం మొదలుపెట్టాడు.

ఈ మధ్యకాలంలో మనవాళ్ళు భూలోకానికి మానవుల ప్రాణాలు తేవడానికి వెళ్తున్నప్పుడు కొంత వింతమాటలు మనవాళ్ళు వింటున్నారట-భర్త పోయినప్పుడు-భార్య, భార్య పోయినప్పుడు భర్త అనుకోవడం-ఈ విధంగా అనుకుంటున్నారట: "ఆయన పోయిన తర్వాత జీవితం బతకడం కష్టం మరియూ వృధా ఒక్కళ్ళే బతకాలంటే-వాళ్ళమీద వీళ్ళమీద ఆధారపడి బతుకు వెళ్ళదీయాలి-దాని బదులు ఆ భగవంతుడు ఇద్దర్ని ఒకేసారి తీసికెళ్తే బాగుండును"అని.

“ఇన్నాళ్లూ నా అలానా పాలనా అన్నీ తానే చూసుకునేది,ఒంటరిగాణ్ణి ఎవరిమీదో ఆధారపడుతూ బతకాలి”అని-ఇదే మాట భర్తలు కూడా అనుకుంటున్నారట- వాళ్ళ భార్యలు పోయినప్పుడు-కొంతమంది మనసులో, మరికొంతమంది తమ తమ బంధువులతో! బహుకొద్దిమంది మాత్రం “ఈ సదుపాయం ఉంటే ఎంత బాగుండు” అని కూడా!

ఈ మాట యమధర్మరాజు చెప్పగానే పరివారం చాలా ఆశ్చర్యంగా,నమ్మశక్యంగా లేనట్లు చూసారు.అధికారుల్లో కొందరు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా మొహం పెట్టారు యముడి మాట విన్న తక్షణం -అందరితో బాటు ఆశ్చర్యపడుతూ!

యమధర్మరాజు ఇలా అడిగాడు వాళ్ళ మొహాలు చూసి "ఏమిటయ్యా మీరు మొహాలు అలా పెట్టారు దిగాలుగా,మానవుల మనసులోని కోరికలు విన్నతర్వాత- ఆ దంపతుల మధ్య ఉన్న ప్రేమా అన్యోన్యానికి సంతోషించాల్సింది పోయి”

“మహా ప్రభు ఇది నిస్సందేహంగా సంతోషించ తగ్గ విషయమే,కానీ ఇప్పడిదాకా భార్య భర్తల్లో ఒక్కళ్ళే వస్తున్నారు- ఎక్కడో నూటికో కోటికో తప్ప.ఇప్పుడు వీళ్ళు జంటలు జంటలుగా వస్తే, వీళ్ళని ఉంచడానికి ఏర్పాట్ల గురించే మా బెంగ,ఇంత రద్దీ ఒక్కసారే పెరిగితే” అని ముక్తకంఠంతో అన్నారు- ఏదో బృందగానంలాగా!

అదీకాకుండా దాదాపుగా ఏడాదినించి మనవాళ్ళకి తాకిడి ఎక్కువయిపోయింది - భూలోకానికి వెళ్లి రావడం-ఈ కొత్త వైరస్ వల్ల.జనాలు ఇబ్బడిముబ్బడిగా పోతున్నారు-ఒక ఊరా,ఒక రాష్ట్రమా,ఒక దేశమా! భూగోళం మొత్తం మనవాళ్ళు ఇట్టే వెళ్తున్నారు,వస్తున్నారు ఎడతెరిపి లేకుండా -అయినా మీదాకా తీసుకు రాలేదు ఈ విషయాన్ని!

“అదీ కాకుండా-మీకు తెలియని విషయమేమీ కాదు,ఎవరి ఆయుష్యు వాళ్లదే వాళ్ళవాళ్ళ పూర్వజన్మల కర్మఫలం వల్ల-అలాంటిది ఇద్దర్ని ఒక్కసారే ఎలా తెస్తాం ఇక్కడికి.వీళ్ళ కోరికవల్ల మనకు- కాదు బ్రహ్మగారికి గట్టి ఇబ్బందే” అన్నాడు ఓ అనుభవజ్ఞుడైన అధికారి-కాస్త బ్రహ్మగారి పేరు వాడుకుంటే మంచిది అన్నట్టు!

(డిజిటల్ యుగపు మానవుల్ని చూస్తున్నాడు కదా-వాళ్ళ దగ్గర నేర్చుకుని ఉంటాడు ఈ తెలివితేటలు) అప్పుడు యముడు "ఓర్నీ అసాధ్యం కూలా ఇవి ఆ మానవులు అనుకునే మాటలు మాత్రమే-అది కూడా కొద్దీ మందే-ఇవి “తధాస్తు” అవ్వాలంటే ముందు మన అందరిలో ఏకాభిప్రాయం రావాలి,అందుకనేగా ముందుగా ఈ విషయాన్ని మీ ముందు ఉంచాను-తర్వాత కదా త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళాలి “పెద్దాయన”

ఒప్పుకోవాలి” అని ఆపి “దీనికి మాత్రం ఎంత తతంగం ఉందనుకున్నారు; ఆయన మాత్రం వెంటనే సరే అనలేడుగా-బ్రహ్మతో, శివుడితో మాట్లాడాలి-తుది నిర్ణయం ఆయన తీసుకున్నా.మన గురువుగారయిన మహాశివుడికి పెద్ద ఇబ్బందేం లేదు, మనం ఒప్పుకుంటే- మనం సామర్ధ్యంతో వచ్చేవాళ్లకి ఏర్పాట్లు అవి చూసుకోగలం అంటే” అన్నాడు-ఇంత చెప్తున్నా ఆ అధికారులు మొహాలు చిన్నబుచ్చుకునే ఉన్నారు!

అప్పుడు యముడు “మీరేం అంత కంగారు,ఆదుర్దా పడబోకండి,బ్రహ్మగారు ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటాడనే నమ్మకం నాకులేదు.ఇలా ఒకళ్ళకు బదులు “భార్య భర్తలు” ఇద్దరూ వస్తాం అంటే ఆయన సృష్టిచేసే వేగం పెంచాలి- ఆయన సిబ్బందిని పెంచుకోవాల్సివస్తుంది మనలాగే.ఇంకో ఇబ్బంది ఏమిటంటే ఆయన భార్య- “సరస్వతమ్మ” ఇప్పటికే సణుగుతోందని వాళ్ళ సిబ్బంది ద్వారా నాకు కబుర్లు అందుతున్నాయి- “బ్రహ్మగారు ఎక్కువ సమయం ఆవిడతో గడపట్లేదని”

లోగొంతుకతో అన్నాడు- చిదంబర రహస్యంలాగా (చిదంబరం కూడా మహా శివుడిదే కదా) ఆ మాట విన్న తర్వాత ఆ అధికార్ల మొహాలు కాస్త కుదుటబడి పూర్వపు స్థాయికి వచ్చాయి.ఇది చూసి యముడు కాస్త ఉత్సాహం తెచ్చుకుని చెప్పడం సాగించాడు!

“ప్రపంచంలో ఇప్పటికే జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నారు రోజురోజుకీ- బ్రహ్మగారు ఆయన భార్యాపిల్లలతో గడిపే సమయం తగ్గిపోతూ వస్తోందని సరస్వతిదేవి ఈ మధ్య రుసరుసలు పెంచిందిట.ఇక జంటలుజంటలుగా ఇలా వచ్చేస్తే- ఈయన ఇక సృష్టివేగం పెంచాలి కదా,దానితో ఆయనకీ పనిభారం పెరుగుతుంది కూడా - వాళ్లిద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి;ముందు మీ అభిప్రాయం చెప్తే అప్పుడు ఆలోచిస్తా అసలు ఈ ప్రస్తావన శ్రీ మహావిష్ణువు దగ్గరకి తీసుకెళ్ళాలా లేదా అని” అన్నాడు.

కాస్సేపు నిశ్శబ్దం ఆవహించింది ఆ మందిరంలో-కొంతసేపటి తర్వాత ఓ అధికారి- వాళ్లలో ఓ అనుభవజ్ఞుడు అనుకుంటా “ఇంత వరకు బాగానే వుంది ప్రభూ, మీ మాట మేము ఏరోజూ కాదనలేదు మాకు చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాం.కానీ ఈ విషయంలో మా అభిప్రాయం ఏమిటంటే- మీరు ఈ ప్రతిపాదన ఎంచక్కా పైవరకు తీసుకెళ్లండి- నిక్షేపంగా”- అని చెప్పి ఒక క్షణం యముడి వేపు చూస్తూ…

“ఒక వేళ వాళ్లందరికీ సమ్మతం అయితే-మాకు కొద్దిగా సిబ్బంది,ఆర్ధిక వనరులు- మీరు కాదనకుండా ఖర్చుకు వెనకాడకుండా ఇవ్వాలి.ఇది శాసనం అయితే దాని ప్రకారం మా విషయపట్టికలోనూ, అన్ని విభాగాల కార్యక్రమపట్టికలోనూ దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటాం.అలాగే దాన్ని అమలుపరచే ముందు మన సిబ్బందికికూడా ముందే చెవినవేసి ఈ మార్పులకు తగ్గట్టుగా వాళ్ళని తయారయి వెళ్ళమంటాం భూలోకానికి అదనపు సరంజామాతో -మళ్ళీ అటూఇటూ హైరానాతో తిరగకుండా!”

చివరగా చిత్రగుప్తుల శాఖాధికారి తన గోడు వెళ్లబోసుకున్నాడు!

“మహా ప్రభూ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది; దేవేంద్రునికి ఈ మార్పువల్ల వీసమెత్తు కాదు, ఆవగింజంత కూడా తేడా ఉండదు.

ముందుగా మనవాళ్ళే కదా అందర్నీ తేవాల్సింది.ఇక్కడ చిత్రగుప్తుల వారి కింద పనిచేసే మేము కదా - పాపపుణ్యాల బేరీజు వేసేది.అది అయిన తర్వాత కదా మనం పుణ్యాత్ములని స్వర్గానికి పంపడం జరిగేది.మా పనిభారం పెరుగుతుంది,ఆయనకేం నాట్యమంటపంలో రంభ, ఊర్వశి, మేనకా తిలోత్తమల నృత్యాలు, విందులూ వినోదాలూనూ”

“కాస్త మీరే ఒడుపుగా, లౌక్యంగా ఈ అంశాన్ని త్రిమూర్తుల దగ్గర ప్రస్తావించి వ్యవహరించాలి, ఏదో పనిభారం పెరుగుతుంది కదా అని మేము ఈ మానవుల కోర్కెను తృణీకరిస్తున్నామనో,వ్యతిరేకిస్తున్నాం అనో అనుకోవద్దు” అని అన్నాడు. చిత్రగుప్తుడు అతని వైపు మెప్పుకోలుగా చూసాడు!

ఆ మాటలు విన్న యముడు సంతుష్టుడై అందరికి అభయం ఇచ్చి సమావేశాన్ని ముగించాడు.స్వర్గాధిపతి ఇంద్రుడికి కబురు పెట్టాడు తన సొంత ఆంతరంగికుని ద్వారా విషయ సూచన చేస్తూ.అలాగే త్రిమూర్తుల నుండి కబురు అందగానే ఆయనకి నిర్ధారణ చేస్తానని ఎప్పుడు వైకుంఠానికి రావాలో అనీనూ కూడా!

మరునాడు యమధర్మరాజు “బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు” కబురు పెట్టాడు- ముగ్గురిని ఒకసారి కలవాలని, వాళ్ళవాళ్ళ వీలు చూసుకుని సమయం నిర్ధారిస్తే వచ్చి విషయం సావధానంగా చర్చిస్తానని.అందునా ఈ మానవులు ఊరకనే వుండరు కదా అంగారక గ్రహం మీద నివాసాలు ఏర్పాటుచేద్దాం అనుకుంటున్నారు- మళ్ళీ అది వేరే అని అనుకున్నాడు మనసులో!

త్రిమూర్తులు ముగ్గురికి ఒకేసారి వీలుకావాలంటే సామాన్యమైన విషయమేం కాదుగా మరి,కొద్దిగా ప్రత్యామ్నాయాల్ని ఏర్పాటుచేసుకోవాలి ఎవరికి వాళ్ళే.

సరిగ్గా వారం రోజుల తర్వాత యముడికి కబురు అందింది ఆయన రావచ్చని దేవేంద్రునితో బాటు;అదే విషయం తన వార్తాహరుడి ద్వారా ఇంద్రుడికి తెలియచేస్తూ ఆయన్ని మరునాడు సమావేశ సమయానికి తిన్నగా వైకుంఠానికి వచ్చేయమన్నాడు.

రేపటి దాకా వేచి చూద్దాం వైకుంఠంలో జరగబోయే సమావేశం గురించి- ఎంతైనా విషయం మన గురించి కదా- అందాకా ఓపిక పడదాం మరి!

సశేషం

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!